టేకులపల్లి, వెలుగు: కోయగూడెం ఓసీలో రోడ్డు క్లీనింగ్ మిషన్ ను గురువారం కాంట్రాక్టు కార్మికులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా గుర్తింపు సంఘం బ్రాంచ్ సహయ కార్యదర్శి కొంగర వేంకటేశ్వర్లు, ప్రాతినిధ్య సంఘం కోసూరి సత్యనారాయణ మాట్లాడుతూ కోయగూడెం ఓసీ ప్రారంభం నుంచి పనిచేస్తున్న సుమారు 23మంది కాంట్రాక్టు కార్మికుల కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
అకస్మాత్తుగా యాజమాన్యం రోడ్డు క్లీనింగ్ మిషన్ తెచ్చి కార్మికులను రోడ్డు పాలు చేశారని, 22 సంవత్సరాలుగా పనిని నమ్ముకుని జీవిస్తున్న కార్మికులు నేడు యాజమాన్యం నిర్లక్ష్యంగా పని నుంచి తొలగించడం సరికాదని ఆవేదన చెందారు. యాజమాన్యం వెంటనే స్పందించి కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సైదులు, ఎర్ర బాలు, సత్యనారాయణ, రాంకూమార్, మంగ్య, బాలు, రాంచందర్, శివ, రాజశేఖర్, అవినాష్, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
